AP Medical Reimbursement : ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 పొడిగించింది. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కు సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం అమలులో ఉంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
వారానికి ఐదు రోజుల పనిదినాలు
అమరావతి రాజధాని పరిధిలోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. సెక్రటేరియట్, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫైల్‌పై ఇటీవల సీఎం చంద్రబాబు సంతకం పెట్టగా, సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొ్న్నారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర సెక్రటేరియట్, హెచ్వోడీల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయనున్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘం వినతితో ఈ గడువును మరికొంత కాలం పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు మరో ఏడాది వారానికి ఐదు రోజుల పనివిధానం కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన సీఎంకు సచివాలయ సంఘం ధన్యవాదాలు తెలిపింది.
జీపీఎస్ వివాదంపై విచారణ
ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండానే ఇటీవల జీపీఎస్ జీవో జారీ, గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయంపై సీఎంవో సీరియస్ అయ్యింది. ప్రభుత్వ అనుమతి లేకుండా జీవో, గెజిట్ ఎందుకు జారీ చేశారని సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ ఉదంతంపై సీఎంవో అధికారులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఆర్థికశాఖ, న్యాయ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో ఎవరు కారణమో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారి, న్యాయశాఖ సెక్షన్ అధికారి హరిప్రసాద్ రెడ్డి పాత్రపై సీఎంవో విచారణ చేస్తుంది. ఈ ఇద్దరు అధికారుల గత వ్యవహారాలపై ఆరా తీస్తుంది.
ప్రభుత్వం మారినప్పుడు నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని బిజినెస్ నిబంధనలు చెబుతున్నా… హడావుడిగా జీపీఎస్ జీవో జారీ, గెజిట్ నోటిఫికేషన్ జారీపై నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజున జీపీఎస్ జీవో జారీ అవ్వడం, సరిగ్గా నెల రోజుల తర్వాత గెజిట్ విడుదల వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత ప్రభుత్వ నిర్ణయాలకు కొత్త ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని బిజినెస్ రూల్స్ చెబుతున్నాయి. కానీ కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు సీఎంవో అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో పాటు పలు శాఖల్లో, మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులున్నారా? అనే కోణంలో సీఎంవో ఆరా తీస్తుంది.
Leave a Reply